పంచభూత లింగాలు

పంచభూత లింగాలు

జీవకోటికి ప్రాణాధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ అయిదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత లింగ క్షేత్రాలు (దేవాలయాలు). విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుని దేవాలయాల్లో పంచభూత లింగ క్షేత్రాలు అత్యంత విశిష్ఠమైనవిగా వెలుగొందుతున్నాయి. ఈ పంచభూత లింగ క్షేత్రాలను శివరాత్రి పర్వదినాన సందర్శిస్తే జన్మ తరిస్తుంది. ఇందులో 4 క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోనూ, ఒకటి ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఉన్నాయి.

పంచభూత లింగ క్షేత్రాలు

1. అగ్ని లింగం – అరుణాచలేశ్వరాలయం – తిరువణ్ణామలై (తమిళనాడు)

2. పృథ్వీ లింగం – ఏకాంబరేశ్వరాలయం – కంచి (తమిళనాడు)

3. ఆకాశలింగం – నటరాజస్వామి ఆలయం – చిదంబరం (తమిళనాడు)

4. జలలింగం – జంబుకేశ్వరాలయం – తిరుచునా పల్లి (తమిళనాడు)

5. వాయులింగం – శ్రీకాళహస్తీశ్వరాలయం – కాళహస్తి (ఆంధ్రప్రదేశ్‌)

 

అగ్నిలింగం-అరుణాచలేశ్వరాలయం-తిరువణ్ణామలై

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగాలలో ఒకటి. తమిళంలో తిరు అంటే ‘శ్రీ’, అణ్ణామలై అంటే ‘పెద్దకొండ’ అని అర్థం. దీన్ని అరుణగిరి అని కూడా అంటారు. అరుణ – ఋణబంధాన్ని హరించేది అని అర్థం. రుణాన్ని తెంచుకోవడమే ముక్తి మార్గం. సూర్యుని నుంచి కాంతిని అందుకొనే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు అరుణాచలం నుంచి పావనత్వాన్ని సంతరించు కుంటాయి అంటాయి పురాణాలు.

అరుణాచలం ఓంకారమే. అరుణాచలంలో ఉన్నది అగ్ని లింగం. అరుణాచలంలోని శివ లింగం దగ్గర అగ్ని కనిపించదు. అక్కడ రాశీభూతమైన జ్ఞానం అందించే శివలింగం ఉన్నది. అందుకే స్కాందపురాణములో జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డముగా ఒక గీత గీసి ఉంటుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రదేశమునకు ముందు గడిపిన జీవిత యాత్ర. జీవి అసలు అరుణాచల ప్రదేశములోనికి పోయినది లేనిది చూస్తారు. అరుణాచలంలోకి ఒకసారి ప్రవేశిస్తే జీవితం మరోలా ఉంటుంది. ఇక్కడ పరమ శివుడు మూడుగా కనపడతాడని పురాణ వాక్యం. అరుణాచలం ఓ పెద్ద పర్వతం. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదాలు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్న పూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం కాగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. మొదటగా దక్షిణ దిక్కులో యమ లింగం ఉంటుంది. నైరుతి దిక్కులో నైరుతి లింగం ఉంటుంది. ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశాడు. ఉత్తర దిక్కున కుబేర లింగం, పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు అన్నామలై క్షేత్రం ఉంటుంది. శివాలయం పక్కన నంది విగ్రహం ఉంటుంది. కుడివైపున పాతాళ లింగం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ఇహంలోనే కాక పరము నందు కూడా సుఖాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం నుంచి ప్రవేశిస్తాము. ఈ గోపురాన్ని శ్రీ కృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. అరుణాచలేశ్వరుని శివ లింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున ఆపీతకుచాంబ అనే పేరుతో పార్వతీ దేవి కూర్చుని ఉంటుంది. ప్రదక్షిణ మార్గంలో యమలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, అష్టలింగాలు, పవిత్ర తీర్థాలు కలవు. తేజో రూపధారి అయిన మహేశ్వరునికి రుద్రాభిషేకం ఇష్టమయినది. దీనివలన సర్వసంపదలు వృద్ధి చెందుతాయి. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడిని ‘తేజోలింగం’ అని పిలుస్తారు.

గిరి ప్రదక్షిణం

ఈ కొండకు తూర్పున విశ్వకర్మ నిర్మితమైన అరుణాచల ఆలయంలో ఏడాదికి 4 సార్లు బ్ర¬్మత్సవాలు జరుగుతాయి. తమిళ నెల కార్తీకంలో (నవంబరు, డిశంబరు నెలలో మధ్యన) జరిగే బ్ర¬త్సవాలు ప్రసిద్ధి. 10 రోజుల ఉత్సవాలు కార్తీక దీపంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అణ్ణామలై కొండమీద మూడు టన్నుల నేతితో భారీ దీపాన్ని వెలిగిస్తారు. కొన్ని మైళ్ళ వరకు ఆ జ్యోతి 10 రోజుల వరకు కనపడుతుంది. అఖండంగా వెలుగుతుంది. కార్తీక జ్యోతి దర్శనం ముక్తి ప్రదమని భక్తుల నమ్మకం. అది నిజం కూడా. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తే శివుని పూజించినట్లే. పౌర్ణమి నాడు ఇది మరింత శ్రేష్టం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కి.మీ.లు ఉంటుంది. చాలామంది కాలి నడకన ప్రదక్షిణ చేస్తారు. నడవలేని వారు కొండ చుట్టూ వాహనంలో ప్రయాణిస్తారు.

260 కోట్ల సంవత్సరాల నాటిది

అరుణాచలేశ్వరాలయానికి వెయ్యి సంవత్సరముల పైబడిన చరిత్ర ఉంది. 9, 10 శతాబ్దాలలో చోళ రాజులు ఈ దేవాలయాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కృతయుగంలో అగ్ని పర్వతం అని, త్రేతాయగంలో స్వర్ణగిరిగా మారిందని, ద్వాపర యుగంలో తామ్రశిలగా ఓ వెలుగు వెలిగి, కలియుగ ప్రారంభంలో రాతి కొండగా మిగిలిందని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలేశ్వరం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్‌బల్‌ సహాని నిర్ధారించారు.

అద్వైత గురువు రమణమహర్షి తిరువణ్ణామలై స్వామి సన్నిధిలో 53 ఏళ్ళు నివశించి 1950లో తనువు చాలించాడు. రమణ మహర్షి ఆలయం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నది. అరుణాచలం చెన్నైకి 185 కి.మీ. దూరంలో ఉన్నది. అరుణాచలేశ్వరానికి వెళ్ళడానికి చెన్నై, తిరుపతి నగరాల నుంచి బస్సులు కలవు. అరుణాచల గిరి పరమశివుడి ప్రత్యక్ష రూపంగా మహేశ్వర పురాణంలో సాక్షాత్తూ వేద వ్యాసుల వారే చెపుతూ, అరుణాచల వైభవాన్ని కొనియాడారు.

పృథ్వీలింగం – ఏకాంబరేశ్వరాలయం (కంచి)

పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వి (భూమి) కి సూచిక. అందుకే ఈ క్షేత్రాన్ని పృథ్వీ లింగం అంటారు. శివుని కన్నులలో ఒకటిగా, సప్తమోక్ష పురాణాల్లో ఒకటిగా పేరు గాంచిన కాంచీపురంలోని శివకంచి ఆలయంలో పరమ శివుడు ఏకామ్రేశ్వరుడిగా, పృథ్వీ లింగ రూపంలో కొలువుదీరి ఉన్నాడు. కాత్యాయన మహర్షి కూతురుగా పెరిగిన పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం ఈ ప్రాంతానికి చేరుకొని సైకత (ఇసుక) లింగం తయారు చేసుకొని తపస్సు చేసింది. తర్వాత శివుడు ఆమెను వివాహం చేసుకొని అక్కడే కొలువుదీరాడు. పృథ్వీ లింగం కనుక స్వామి వారికి అభిషేకం చేయరు. పానవట్టమునకు అభిషేకం చేస్తారు. దీనిని ధారాభిషేకం అంటారు. భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలసి ఉన్నది.

ఏకాంబరేశ్వర ఆలయం లోపల మండలంలో వేయి స్తంభాలు ఉంటాయి. అలాగే 1008 శివలింగాలు ప్రతిష్టించి ఉంటాయి. దేవాలయం లోపల దాదాపు 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనము చూడగలం. ఆలయం చాలా ప్రాచీనమైనది. 192 అడుగుల ఎత్తుగల దక్షిణ రాజగోపురం చాలా ఎత్తైనది. రాజగోపురాన్ని 1509 లో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. ఈ ఆలయం చాలా విశాలమైనది.

18 పురాణాలలో ప్రస్తుతించిన పవిత్ర స్థలం కాంచీపురం. పల్లవరాజుల కాలం నుండి ఒక్కొక్క శతాబ్దంలో నిర్మించిన అందమైన దేవాలయాలను ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అనేక శతాబ్దాలనాటిది.

108 సుప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఇది ప్రసిద్ధి చెందిన ఆలయం. చెన్నై నుండి 76 కి.మీ దూరంలో, తిరుపతి నుండి 96 కి.మీ. దూరంలో ఉండి, తమిళనాడు రాష్ట్రంలో సుప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్నది.

శివకంచిలో గల ఏకాంబరేశ్వరాలయము, కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము రెండూ కంచి కామకోటి పీఠం వారి అధ్వర్యంలో నడుస్తున్నవి. అపర శంకరాచార్యుడు చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు స్వయంగా ఈ దేవాలయంలో పూజలు చేస్తూ జీవితం గడిపారు. అంతటి ప్రఖ్యాతి గల శైవ దివ్యక్షేత్రం ఇది.

ఆకాశ లింగం – నటరాజ ఆలయం – చిదంబరం

దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ముఖ్య పట్టణం చిదంబరం. మద్రాసు నుండి 231 కి.మీ. దూరంలో ఉంటుంది. చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం చుట్టు ప్రక్కల ‘తివై’ అనే రకం చెట్లు ఉంటాయి. అందుకే దీన్ని ‘తివై చిదంబరం’ అన్నారు. దీని పూర్వనామం చితాంబరం. కాలక్రమేణా చిదంబరంగా మారింది. చిత్‌ అనగా చైతన్యము, ఆత్మ, మనస్సు అరటారు. అంబరం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని, అందుకే దీనిని చిదాకాశం అని అంటారు.

ఈ ఆలయంలో 5 మండలాలు ఉన్నాయి. మొదటిది చిత్‌ అంబళం. ఇక్కడ నటరాజ స్వామి, ఆయన అర్థాంగి శివకామ సుందరి కొలువై ఉన్నారు. రెండవది కనకసభ. మూడవది 56 స్థంభాలు కలిగిన నృత్య మండపం. నాలుగవది వేయి స్థంభాల మండపం. అయిదవ దానిని దీపసభగా పిలుస్తారు. ఇది పంచభూత లింగాలలో ప్రసిద్ధమైంది. ఇది స్వయంభు క్షేత్రం. రాత్రి సమయాల్లో నటరాజ స్వామి చేసే తాండవం దర్శించటానికి విష్ణువు, ఆయన వెంట ఆదిశేషుడు (పతంజలి రూపంలో) ఆలయానికి వచ్చేవారని పురాణ కథనం. ఆలయ గోడలపై చిత్రించిన ఆ యుద్ధం చిత్రాలు నేటికీ సాక్ష్యాలుగా ఉన్నాయి.

12, 13 శతాబ్దాలలో ఈ ఆలయాన్ని చోళ రాజులు, పల్లవరాజులు అభివృద్ధి చేసినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు మానవ దేహానికి, ఈ దేవాలయానికి దగ్గర పోలికలున్నట్లుగా చెబుతున్నారు. చరిత్రకారుల భావన కూడా ఇదే. చిదంబర ఆలయ క్షేత్రానికి అయస్కాంత శక్తి ఉన్నదని, ఈ నటరాజ విగ్రహంలోని కాలి బొటన వేలు భూమధ్యరేఖను సూచిస్తోందని చెబుతారు.

చిదంబరంలోని ఆకాశలింగం, కాళహస్తిలోని యమలింగం, కాంచీపురంలోని పృథ్వీలింగం గల దేవాలయాలు ఒక సరళరేఖలో 792 డిగ్రీల 41 నిమిషాల తూర్పు రేఖాంశం మీద నిర్మితమయ్యాయని; దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతమని అంటారు.

మన శరీరంలోని నవరంధ్రాల మాదిరిగా ఈ ఆలయానికి 9 ద్వారాలు కలవు. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒక మనిషి ఒక రోజులో జరిపే శ్వాసలోని ఉచ్చ్వాస నిశ్వాసాల సంఖ్యతో సరిపోతుంది. ఆ బంగారు రేకుల్ని తాపడం చేయడానికి ఉపయో గించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. మనిషి శరీరంలో నాడుల సంఖ్యకు సమానం. యోగా శాస్త్రాన్ని అనుసరించి గుడిలో గల 4 మండపాలు నాలుగు వేదాలకు ప్రతీక. శివ పూజలోని 28 కైంకర్యములను సూచిస్తూ 28 స్థంభాలు అమ్మవారి ప్రాంగణంలో ఉన్నాయి. వీటి మీద 64 కళలకు గుర్తుగా 64 బీములు ఉన్నాయి. గోపురం మీద గల నవకలశాలు నవశక్తులకు సంకేతం. అర్థ మండపంనకు అనుకొని ఉన్న మండపంలో అష్టాదశ పురాణాలకు ప్రతీకగా 18 స్థంభాలు కలవు.

చిదంబర రహస్యం

చిదంబర రహస్యం అనేమాట ఆధ్యాత్మిక పరిభాషకు సంబంధించినది. ఎవరైనా పక్కవారికి వినిపించకుండా చెవిలో చెవి పెట్టి మాట్లాడు కుంటుంటే పక్కవాళ్ళు ఏమిటి గుసగుసలు అంటూ తీగ లాగడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ‘ఆ ఏమున్నది ! అంతా చిదంబర రహస్యం’ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తారు.

గర్భగుడిలో నటరాజస్వామికి కుడిపక్కన చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తూ ఉండి – అర్చకులు తెరను తొలగించినప్పుడు భగవంతుని ఉనికిని తెల్పే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కన్పిస్తాయి. ఆ తెర బయట వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తినీ సూచించే కాషాయరంగు ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గుడిలోని మూల విరాట్లు ఉండవలసిన స్థానంలో ఖాళీ స్థలం ఉంటుంది. నిరాకారంగా ఉన్న స్వామికి పూజలు చేస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహం భవ అంటాం. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. అంటే అక్కడ ఏ రూపం లేదు. కాని దైవసాన్నిధ్యాన్ని అనుభవిస్తుంటారు. అదే చిదంబర రహస్యం.

మరొక వింత ఏమిటంటే, గుడి బయటకి వచ్చి వెనుకకు తిరిగితే ఆలయ గోపురం మన వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. నిజం. ఇది సత్యం. భక్తుల అనుభవం. నా స్వీయ అనుభవం కూడా. ఇన్ని విశిష్టతలున్న చిదంబర క్షేత్రాన్ని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృత ఫలంగా భావించాలి.

జలలింగం – జంబుకేశ్వరాలయం – తిరుచునాపల్లి

తమిళనాడులోని తిరుచునాపల్లిగా పిలిచే తిరుచ్చికి 11 కి.మీ.ల దూరంలో కావేరి నది ఒడ్డున గల శ్రీరంగ క్షేత్రంలో (శ్రీరంగనాథ స్వామి) ఆలయమునకు 4 కి.మీ. దూరంలో జంబుకేశ్వర ఆలయం కలదు. పంచభూత క్షేత్రాలలో ఇది ఒకటి. పూర్వం శంభుడు అనే ఋషి నిత్యం చేసే అభిషేకం, పూజలు, తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై మహర్షి కోరిక మేరకు జలలింగ రూపంలో శ్రీ జంబుకేశ్వర స్వామిగా కొలువు తీరినట్లు కథనం. ఈ దేవాలయం ‘జలం’ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్‌, తిరువనైకావెల్‌ అనే పేర్లు కలవు. ఏనుగు చేత పూజలందుకొంటున్న క్షేత్రం అని, జంబువృక్షాలు (తెల్ల నేరేడు) అధికంగా ఉండుట వలన ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చినదని చెబుతారు. జంబుకేశ్వరునికి పూజ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. కొంత సేపటికి ఆ వస్త్రం తీసి పిండుతారు. పిండితే ఆ వస్త్రం నుండి నీరు వస్తుంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు. స్వామి వారి దేవేరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారికి పెట్టిన బొట్టు అసలు సిసలైన నవరత్నములలో ఒకటైన మాణిక్యం. ఇది ఇక్కడ చూడదగినది. పూజారిని అడిగితే హారతి ఇచ్చే సమయంలో మనకు చూపిస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు దగ్గరలో గల శ్రీరంగనాథ ఆలయాన్ని దర్శించవచ్చు. తిరుచునాపల్లికి మద్రాసు, హైదరాబాద్‌, తిరుపతి, అన్ని ప్రదేశముల నుండి రైలు, బస్సు, విమాన సౌకర్యము కలదు.

ఈ జంబుకేశ్వర దేవాలయము చాలా విశాలమైనది. చూడదగినది. ఈ ఆలయంలో గల జంబుకేశ్వర లింగానికి చేసే జలాభిషేకాన్ని ఆవృతాభిషేకం అంటారు. (ఎనిమిది విధములైన అభిషేకములలో ఒకటి).

 

వాయులింగం (దక్షిణ కైలాసం) శ్రీకాళహస్తి

నమః శివాయలో ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’మరుల్‌ (వాయువు), ‘శి’ శిఖ (అగ్ని), ‘వా’ వారి (జల), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్ఛరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. పరమ శివుడు వాయులింగ రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం. వాయు లింగ రూపంలో ఉన్నది అనటానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన గల రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ కదులుతూ ఉంటుందట. ఇచట గల శివలింగానికి (వాయు లింగంనకు) ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇది పరమేశ్వరునికి మహా ప్రీతి. దీనివలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం దాదాపు 5500 ఏకరాల్లో విస్తరించింది. క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుండే అభివృద్ది చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ గుడికి వెళితే మహాదేవుడి దర్శనం, అలనాటి శిల్ప కళా వైభవాన్ని దర్శించుకోచ్చు. వాయు లింగేశ్వరుని దేవేరి అయిన పార్వతీ దేవి శివుని గూర్చి తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందుటచే ఆమె ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబగా కొలువు దీరింది.

సాలె పురుగు, సర్పము, ఏనుగులు పోటీపడి శివుడిని ఆరాధించి శివునిలో ఐక్యమైన ప్రాంతంలో భూలోకాన్ని చూసేందుకు వచ్చిన ఆది దంపతులు (పార్వతీ పరమేశ్వరులు) స్వర్ణముఖీ నదీ తీరంలో ఉండిపోయినట్లు కథనం.

పూర్వం చీరల అల్లకంలో దిట్ట అయిన కరబుడు తామ్రపర్ణీ నదీ తీరంలో నివశిస్తూన్నాడు. శివ భక్తుడైన ఇతడు దుష్ట సహవాసం చేత శివారాధన వైదిక కర్మలను విస్మరించి అనారోగ్యానికి గురై మరణించాడు. తరువాతి జన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఆ సాలీడు తన దారములతో వాయు లింగేశ్వరునికి కైలాసంలో ఉన్నట్లు వేదికలు, భవనాలు అల్లుతూ ఉండేదట. దాని భక్తిని పరీక్షించాలని, పరమేశ్వరుడు ఓ రోజు ఆ అల్లికలను అగ్నికి ఆహుతి ఇచ్చాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించినాడట. కాళము (సర్పం), హస్తి (ఏనుగు) కథలు కూడ ఇలాంటివే. పూర్వం ఇద్దరు శివభక్తులు పూర్వజన్మ పాపాలతో అష్టకష్టాలు పడుతూ మరణిస్తారు. తరువాతి జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఒక మణిని తెచ్చి లింగానికి అర్పించి పూజలు చేసేది. ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్ళు తెచ్చి, మారేడు, బిల్వ పత్రాలతో పూజ చేస్తూ ఉండేదట. మరునాడు ఏనుగు వచ్చేసరికి బిల్వ దళాలు అన్ని గందరగోళంగా కింద వేసినట్లు ఉండేది. సర్పం కూడా తాను తెచ్చి పూజ చేసే మణి క్రిందకు వేసినట్లు గమనించిందట. ఒకరోజు ఏనుగు వచ్చి మణిని క్రింద తోయటం చూసిన సర్పం కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. తొండంలో నుండి తల నడినెత్తికి వెళ్ళి, అక్కడ గిరగిరా తిరుగుతోంది. ఆ బాధను తట్టుకొనలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులు శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం ‘శ్రీ, కాళ, హస్తి’ అయింది. మహాభక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్ళనే పీకి శివునికి అర్పించింది ఇక్కడే. అందుకే కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.

పుత్రశోకానికి గురైన వశిష్ట మహర్షికి దక్షిణ కైలాసంలోనే పంచముఖ నాగ లింగేశ్వరునిగా దర్శనమిచ్చాడు పరమేశ్వరుడు. ఆ నాగరూపం కారణంగానే శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంగా వర్ధిల్లుతోంది. సర్పదోషం, రాహు, కేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి రాహు కేతు పూజలను జరిపించుకొని వెళుతుంటారు. ఈ ఆలయంలో శివునితో పాటు పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణదేవరాయల విజయ స్థంభం, జలవినాయకుడి ఆలయం, ఆలయానికి దక్షిణం వైపు ఉన్న బ్రహ్మగుడి అన్నీ దర్శించుకోవచ్చు. కాళహస్తికి దగ్గరలోనే రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి క్షేత్రం, రైల్వేస్టేషన్‌, అన్ని ప్రాంతాలలో బస్సు సౌకర్యము, ఊరిలో సత్రములు, లాడ్జి, భోజనము వంటి అన్ని సౌకర్యాలు లభిస్తాయి. తిరుపతికి 36 కి.మీ.ల దూరంలో అన్ని వసతులతో గల ఈ దేవాలయం భక్తుల సందోహంతో విరాజిల్లుతోంది.

ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవం జరుగుతుది.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *