నైతిక విలువలు నేర్పే విద్య నేటి అవసరం

నైతిక విలువలు నేర్పే విద్య నేటి అవసరం

శ్రావణ బెళగోళ జైన మఠ అధిపతి స్వస్తిశ్రీ కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామితో ముఖాముఖి

నైతికత ప్రాతిపదికగా ఉండే విద్య నేడు ఎంతైనా అవసరం. శరీర అభివృద్ధికి పోషక విలువల ఆహారం, ఆరోగ్యానికి మందులు ఎలా అవసరమో మన మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి నైతిక విలువలు బోధించే విద్య అంతే అవసరం.

జైనుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగానే కాక చారిత్రక ప్రాముఖ్యం కూడా సంతరించుకున్న విశిష్టత శ్రావణ బెళగోళకున్నది. అలాంటి శ్రావణ బెళగోళ జైన మఠానికి ప్రస్తుత అధిపతి స్వస్తిశ్రీ కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామి. జైన ధర్మంలో అత్యంత విశిష్టత గల సాంస్కృతిక ఉత్సవంలో 12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు మహామస్తకాభిషేకం నిర్వహిస్తున్నారు. చారుకీర్తి భట్టారక స్వాముల వారి పర్యవేక్షణ, మార్గ దర్శకత్వంలో జరుగుతున్న 4వ మహామస్తకాభిషేక మిది. ఈ మహత్తర పర్వం సందర్భంగా మహామస్తకాభిషేక చరిత్ర, ప్రాముఖ్యం గురించి; జైనమత సిద్ధాంతాలు, బోధన గురించి; బాహుబలి విశిష్టత, శ్రావణ బెళగోళ చరిత్రల గురించి స్వామిజీతో జరిపిన ముఖాముఖిలోని అంశాలు.

ప్రశ్న : భగవాన్‌ బాహుబలి మహామస్తకాభిషేకా లను ఇంతకుముందు కూడా మీరు నిర్వహించారు గదా! వాటి నిర్వహణ తీరుతెన్నులు ఏమిటి ? భక్తులు, జన సామాన్యపు స్పందన ఎలా ఉంది ?

సమాధానం : 1970లో మహావీర్‌ జయంతి నాడు ఈ పవిత్ర క్షేత్రపు బాధ్యతలను నాకు అప్పగించారు. నా హయాంలో మొదటి మహా మస్తకాభిషేకం 1981లో జరిగింది. అది మహా మస్తకాభిషేకపు సహస్రాబ్ది సందర్భం. ఆ సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి. ఆ ఏడాది మా పరమపూజ్య ఆచార్య విద్యానంద భీమరాజుల వారు ఢిల్లీ నుంచి శ్రావణ బెళగోళ దాకా కాలినడకన వచ్చారు. నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆ మ¬త్సవాన్ని ప్రారంభించారు. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండురావు అద్భుతమైన సహకారమందించారు.

1993 నాటి మహామస్తకాభిషేకానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. నాటి రాష్ట్రపతి శ్రీ శంకరదయాళ్‌ శర్మ దానికి ప్రారంభోత్సవం జరిపారు. అదే సమయంలో ‘ప్రాకృత విద్యాసంస్థ’ కూడా ప్రారంభ మైంది. ఆ సందర్భంగా శంకర్‌ దయాళ్‌ శర్మ దాదాపు గంటసేపు ప్రాకృతం గురించి పాండిత్య పూర్వకంగా, సవివరంగా, అనర్గళంగా ప్రసంగించారు. ఈ మహామస్తకాభిషేక సమయంలోనే ‘జన కళ్యాణ’ పథకాలు ప్రారంభమయ్యాయి.

నా హయాంలో మూడవసారి 2006లో మహామస్తకాభిషేకం జరిగింది. ఆనాటి రాష్ట్రపతి డా||ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం ఆ ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు జరుగనున్న మహామస్తకాభిషేకానికి సముచితమైన ప్రణాళికతో సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్ర : ఒక పుణ్యక్షేత్రంగా శ్రావణ బెళగోళ చరిత్ర గురించి, ఈ పీఠాన్ని పరంపరగా అధిరోహించిన ఆచార్యుల గురించి, వారు సాధించిన విజయాల గురించి వివరిస్తారా ?

స : శ్రావణ బెళగోళ గత 2,300 సంవత్స రాలుగా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. హరప్పా – మొహంజొదారో శకం నుంచే దీని ఆనవాళ్లు పరిశోధనలలో లభించాయి. కనుక ఈ పవిత్ర స్థలానికి కనీసం 5 వేల ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పవచ్చు. నిజానికి హరప్పా – మొహంజొదారో త్రవ్వకాలలో లభించిన ముద్రల మీద బాహుబలి చిత్రాలున్నాయి.

‘ద్వాదశాంగ’ శ్రుత కేవలీ భద్రబాహు ఇక్కడకు వచ్చాడు. ఈయన మహావీర తీర్థంకరుని వారసుల్లో ఎనిమిదవవాడు. తీర్థంకరుల సిద్ధాంతానికి సంబంధించిన మొత్తం 12 అంగాలను ఈయన అవపోశన పట్టాడు. స్వయంకృషితోనే అయినప్పటికీ శాస్త్రాలను, వాటి అసలైన అర్థాలను కరతలామలకం చేసుకున్నాడు. శ్రుత కేవలీ భద్రబాహుతో పాటు తక్కిన 12 వేల మంది సాధువులకు చిక్కబెట్ట (చంద్రగిరి) తపో భూమిగా ఉండేది. కనుక ఆనాటి నుంచే అదొక యాత్రాస్థలంగా ఉన్నది. చంద్రగుప్త మౌర్యుడు తన వార్థక్యంలో ఇక్కడే ఒక సన్యాసి వద్ద దీక్ష తీసుకొని తపస్సు ఆచరించినట్లు చరిత్ర వెల్లడిస్తున్నది. దీని గురించిన సమాచారం ప్రాకృత ధర్మశాస్త్రాల్లో ఉంది. శ్రావణ బెళగోళ చరిత్ర క్రీ.పూ.3వ శతాబ్దంలో మొదలవుతుంది.

క్రీ.శ.12వ శతాబ్దంలో ఈ మఠం దిగంబర సాధువుల అజమాయిషీలో ఉన్నప్పటికీ మఠాధిపతి మాత్రం వస్త్రధారియై విధులు నిర్వర్తించాలని నిర్దేశించారు. అప్పటి నుంచి అదే ఆచారంగా వస్తున్నది.

ప్రాపంచిక బంధనాలలో చిక్కుకోకుండా జననమరణ చక్రం నుండి విముక్తులై మోక్షం సాధించాలనేదే తీర్థంకరుల బోధనల సారాంశం. అప్పట్లో ప్రాకృతమే ప్రధాన భాషగా ఉండేది. ఆగమాలు, జైన సాహిత్యం కూడా అదే భాషలో ఉండేవి. దొడ్డబెట్ట (వింధ్యగిరి) పై భగవాన్‌ బాహుబలి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో అదొక పుణ్యక్షేత్రంగా కూడా మారింది. ¬యసల రాజ్యంలో స్థానిక పాలకుడైన హుల్ల చమోపతి 24వ తీర్థంకర జైన బసది నిర్మించాడు. చిక్కబెట్ట, దొడ్డబెట్ట, భాండార బసదిలు శ్రావణబెళగోళను ఒక పుణ్యస్థలంగా మార్చాయి. ఈ యాత్రాస్థలం గురించిన తాళపత్ర లేఖనాల వల్ల కూడా ఇది పవిత్రంగా పరిణనలో ఉన్నది.

ప్ర : భగవాన్‌ బాహుబలి గురించి, శ్రావణ బెళగోళ గురించి ఎన్నో గ్రంథాలు, వ్యాసాలు ప్రచురిత మైనాయి. ఇలాంటి అన్ని గ్రంథాలను, వ్యాసాలను సంకలితం చేయడానికి లేదా వాటి గురించిన గ్రంథ సూచిక రూపొందించడానికి ప్రయత్నాలు లేదా ప్రణాళికలేమైనా ఉన్నాయా ?

స : అలాంటి సంకలనాలెన్నో ప్రచురితమైనాయి. మహామస్తకాభిషేకం సందర్భంగా అలాంటి సాహిత్యాన్నంతటినీ సంకలితం చేసి ప్రచురించే ప్రణాళిక కూడా ఉన్నది. కొన్ని గ్రంథ సూచికలు ప్రచురితమయ్యాయి.

ప్ర : శ్రావణబెళగోళలో గాక మరెన్నో చోట్ల భగవాన్‌ బాహుబలి విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రావణ బెళగోళలోను, ఇతర చోట్ల జరిపే మహామస్త కాభిషేకాల మధ్య తేడాలు, ప్రత్యేకతలు ఏమిటి ?

స : దేశవ్యాప్తంగా భగవాన్‌ బాహుబలి విగ్రహాలను చాలాచోట్ల ప్రతిష్ఠించారు. దేశమంతటా మందిరాల్లోనూ వివిధ పరిమాణాలు గల బాహుబలి విగ్రహాలున్నాయి. ప్రజానీకం మనస్సులలో బాహుబలి ఉండటమే దీనికి కారణం.

కర్కల, వేనూర్‌, ధర్మస్థల, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లలో ఇదేవిధంగా బాహుబలి మహా మస్తకాభిషేకాలు జరుగుతాయి. డిల్లీ, ముంబైలలో 21 అడుగుల ఎత్తుగల ఆదినాధ-భరత- బాహుబలి త్రయం విగ్రహాలు ప్రతిష్ఠితమైనాయి. ఈ చోట్లలో బెల్గాంలోని షెదవాల, కొఠాలిలలో కూడా అభిషేకాలు జరుగుతాయి.

భారతదేశంలో సాంస్కృతిక ప్రాముఖ్యం గల ప్రధాన ఉత్సవాలలో మహామస్తకాభిషేకం ఒకటి. మహా కుంభమేళా, మహాస్నానాల మాదిరిగానే మహామస్తకాభిషేకానికి కూడా దానిదైన ప్రాధాన్యం ఉంది. సంవత్సరాల కొకసారి జరిగే మహాకుంభమేళా హైందవ సాంస్కృతిక ఉత్సవాలలో వన్నెకెక్కింది. భారతదేశంలో హిందూమతం, జైనమతం తోడుతోడుగా వర్ధిల్లాయి.

మహామస్తకాభిషేకం ఒక దేశవ్యాప్త మ¬త్సవం. ఈ ఉత్సవం జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నది. శ్రుతకేవలి భద్రబాహు, చంద్రగుప్త మౌర్యుల చరిత్ర ఈ స్థలంతో ముడివడి ఉన్నది. 12వ శతాబ్దంలో శ్రావణబెళగోళకు రాజ్యపరంగా ప్రాముఖ్యం లభించేవరకు 2వ శతాబ్దం నుంచి గాంగ రాజ్యానికి చెందిన రాజులు, దొరలు ఇదే రాజధానిగా పాలించారు. తదుపరి ¬యసలులు, విజయనగర, మైసూరు రాజులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. వలసపాలకుల కాలంలోనూ మహామస్తకాభిషేకం నిర్విఘ్నంగా కొనసాగింది. 1925లో మైసూరు మహారాజు స్వయంగా మహామస్తకాభిషేకానికి ఆధ్వర్యం వహించాడు.

1981లో మహామస్తకాభిషేకం అంతర్జాతీయ ప్రాముఖ్యం సాధించింది. జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, జపాన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బాహుబలి మహామస్తకాభిషేకం గురించి ఆయా దేశాల స్థానిక భాషల్లో వ్యాసాలు ప్రచురితమైనాయి. కార్యక్రమం మొత్తం టి.వి.ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది.

2006లో జరిగిన మహామస్తకాభిషేకం సందర్భంగా ఒక విశిష్ట ప్రయత్నం చేశాం. అభిషేకానికై ఆరు ఖండాల నుంచి పుష్పాలను, కుంకుమను తెప్పించాం. చాలా దేశాల నుంచి అపురూపమైన పుష్పాలు రాశులుగా వచ్చాయి. ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక పుష్పాలతో భగవాన్‌ బాహుబలిని అభిషేకించాం.

ప్ర : భగవాన్‌ బాహుబలిలో సామాన్యుల నుంచి ఆచార్యుల వరకు అనుసరించదగిన ఆదర్శాలు ఏమున్నాయి ?

స : బాహుబలి అందరికీ హీరోయే. యోధులకు, రాజ్యాధిపతులకు, సాహసికులకు ఆయన ఒక ఒజ్జ బంతి. త్యాగధనులకు కూడా అనుసరణీయుడు. ఎందరి ప్రాణాలనో బలిగొనే క్రూర యుద్ధాలను నివారించడానికి తన సచివుల సలహాను ఆమోదించే వాడు కనుక పాలకులకూ ఆదర్శమూర్తే. అహింస ఆయనకు పరమధర్మం. ఇతరుల నుంచి సదాశయాలను స్వీకరించే సద్గుణం ఆయనలో ఉంది. స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, వీరాధివీరుడు, అసమాన త్యాగశీలి, తపోనిధి అయిన ఆయనను మించిన శక్తి సంపన్నుడు వేరొకడు లేడు.

బాహుబలి ఆదర్శాలు మ¬న్నతమైనవి. అహింస ద్వారా సుఖాన్ని, త్యాగం ద్వారా శాంతిని, సఖ్యం ద్వారా ప్రగతిని, ధ్యానం ద్వారా ముక్తిని సాధించాలన్న తన సనాతన సందేశంతో ఆయన ప్రజల హృదయాలలో, మనస్సులలో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. పంపకవి వ్రాసిన ‘ఆదిపూర్ణ’, రత్నాకర వర్ణించిన ‘భరతేశవైభవ’ చూస్తే ఆయన విశిష్టత అర్థమవుతుంది. కనుక బాహుబలికి సాహిత్యంలోనూ సమున్నత స్థానం ఉంది. మీరు ప్రపంచంలో ఏ మతం, దేశం, సమాజం చరిత్రను పరిశీలించినా బాహుబలిని పోలిన మహా తపశ్శాలి ఇంకొకరు కనిపించరు. ఆయన తీర్థంకరుడు కాకపోయినా తన తపో తీవ్రతలో జైన మతంలోని తీర్థంకరులను మించిపోయాడు.

ప్ర : అహింస, సత్యం, అపరిగ్రహం అనేవి జైనమతం లోని ప్రాథమిక అంశాలు. ఈనాటి పరిస్థితుల్లో వీటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఆధునిక యుగంలో అహింస, సత్యం, అపరిగ్రహాలను పాటించడం ఎంత మేరకు ఆచరణ సాధ్యం ?

స : ఈనాడు మనకు తరచుగా వినిపించే ‘నిరాయుధీకరణం’ అనేది బాహుబలి సందేశమే. ఆధునిక కాలంలో ఇది ఎంతైనా సముచితం. చిన్నచిన్న ఆయుధాల మొదలు అణుబాంబు దాకా ప్రతి దేశానికి ఏవో కొన్ని ఆయుధాలున్నాయి. అయినా వీటిని ప్రయోగించడానికి అందరూ సంశయిస్తున్నారు. ప్రయోగించే దేశాన్ని కూడా సర్వనాశనం చేయగల ఇలాంటి ఆయుధాలను ప్రయోగించడమనేది ఆషామాషీ విషయం కాదు. మూడో ప్రపంచ యుద్ధం ఎలా ఉండవచ్చు అని ఒకసారి ఎవరో ఐన్‌స్టీన్‌ను అడిగితే ‘మూడో ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేను కానీ నాలుగో ప్రపంచ యుద్ధం కోసం మనుషులెవరూ మిగలరు అని మాత్రం చెప్పగలను. యంత్రాలు తమలో తాము కొట్లాడుకో వచ్చు’ అన్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ దిశగా పోతున్నామేమో అనిపిస్తున్నది. కనుక నిరాయుధీకరణ అనేది అత్యంత ప్రాధాన్యం గల విషయం. దేశాన్ని రక్షించుకోవటం కోసమైతే యుద్ధానికి దిగవచ్చుకాని సర్వనాశనానికి దారితీసే కదన కుతూహలం ఏ మాత్రం తగదు.

అపరిగ్రహం విషయానికి వస్తే దేనినైనా మన అవసరాలకు తగినంత మేరకే మనం ఉంచుకొని, ఎక్కువగా ఉన్నదానిని ఇతరుల కోసం ఇచ్చి వేయాలి. అయితే దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కనీసం అణగారిన అట్టడుగు ప్రజల కోసమైనా దానధర్మాలు చేయాలి. ఇదే అపరిగ్రహం. ‘పరిమిత పరిగ్రహం’ అనేది జైనమతంలోని ‘అనువ్రతాల్లో’నే ఒకటి. దీని ప్రకారం ఒక వ్యక్తి తన అవసరాల మేరకు సంపదను వాడుకొని తక్కిన దానిని దానం చేయాలి.

ప్ర : ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో కూడా అంతటా తామసిక శక్తులు పెచ్చరిల్లిపోతున్నట్లు కనిపిస్తోంది. సాత్విక శక్తులను ఎలా బలోపేతం చేయగలం? సాత్విక గుణాలను తనలో నిలుపు కోవటం సామాన్యుడికి సాధ్యమవుతుందా ?

స : స్వచ్ఛమైన సాదాసీదా సాత్వికాహారాన్ని తీసుకోవటం ఒక మార్గం. విద్య ద్వారా మనస్తత్వంలో మార్పును సాధించడం రెండవది. నైతికత ప్రాతిపదికగా ఉండే విద్య నేడు ఎంతైనా అవసరం. శరీర అభివృద్ధికి పోషక విలువల ఆహారం, ఆరోగ్యానికి మందులు ఎలా అవసరమో మన మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి నైతిక విలువలు బోధించే విద్య అంతే అవసరం. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు కూడా తగినంత తీరిక లేనట్లుంది. పిల్లలను బడికి పంపించటం, తిరిగి వచ్చాక తమ ఇంటి పనులతో సతమతం కావడంతోనే తల్లిదండ్రులకు కాలం గడిచిపోతున్నది. వారు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. మఠాలు, సంస్కార శిబిరాలను నిర్వహించి సులభగ్రాహ్యమైన నైతిక సాహిత్యాన్ని పిల్లలకు అందుబాటులోకి తేవాలి.

నైతిక విలువలను అందించి ప్రజలను బాధ్యతా యుత పౌరులుగా తయారు చేసే కార్యక్రమాలను టి.వి. ఛానళ్ళు ప్రసారం చేయాలి. అలాంటి ఛానళ్లు చాలానే ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం మనకు ఒకటే ఛానల్‌ ఉండేది. ఇప్పుడైతే భక్తి, సంస్కృతి, పురాణాలు, సంప్రదాయాలకు అంకితమైన ఛానళ్ళు కూడా ఉన్నాయి.

ప్ర : ఈ రోజుల్లో అన్ని రాజకీయమయం అవుతున్నాయి. మతాన్ని ఎన్నికల రాజకీయాలకు వాడుకుంటున్నారు. మతం, రాజకీయాలు కలసిపోవటం మంచిదేనా లేక విడిగా ఉంటేనే మంచిదా ?

స : మఠం అనేది విద్యార్థులు చదువుకునే చోటు. అది సంస్కృతిని బోధించే విద్యాలయం. ఈనాడు ఎన్నో మఠాలు, ధార్మిక సంస్థలు ఆధునిక విద్యాలయా లను నడుపుతున్నప్పటికీ అవి తమ సంప్రదాయాలను విడనాడలేదు. అన్ని మఠాలు, ఆశ్రమాలు ధార్మిక విద్యను అందిస్తున్నాయి. సాంస్కృతిక విలువలను బోధించే విద్వాంసులను తయారు చేస్తున్నాయి. కాని నేటి తరం వారు ఇంజనీరింగ్‌, మెడికల్‌ లేదా ఎం.బి.ఏ. మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అధిక జీతాలు లభించే ఉద్యోగాల ఆకర్షణ కారణంగా నేటి గురుకులాలకు విద్యార్థులు లభించటం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నా వంటి మఠాధిపతులంతా మన ధర్మాన్ని, గురుకుల సంప్రదాయాన్ని, సంస్కృతీ వారసత్వాలను పరిరక్షంచడం ఎలాగని ఆలో చిస్తున్నాం. అధిక జీతాల వృత్తుల పట్ల నేటి యువత ఆకర్షితులవుతునన్నప్పటికీ మా ప్రయత్నాలు మేము విరమించలేదు. మా విద్యా సంస్థలు, సంస్కృత పాఠశాలలు, గురుకులాల ద్వారా కూడా మా పని కొనసాగుతున్నది. చాలావరకు మఠాలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాయని, ఇది మంచిదేనని నా అభిప్రాయం.

– ఆర్గనైజర్‌ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *