చనిపోయినప్పుడు వినిపించేది కాదు

చనిపోయినప్పుడు వినిపించేది కాదు

ప్రపంచ భాషల్లో గల సామాజిక, ధార్మిక, మానసిక, తాత్విక, సర్వమత గ్రంథాలన్నింటిలోనూ శ్రీమత్‌ భగవద్గీత అత్యుత్తమమైనది. ఈ గ్రంథం వేదాలు, ఉపనిషత్తులు, యోగ దర్శన, ధర్మ గ్రంథాల సారమని పండితులు విశ్వసిస్తారు. ఇది జాతి, మత, కుల, లింగ, వర్ణ భేదం లేక మానవులందరికి సుఖశాంతులను, వారి అభ్యుదయానికి మార్గదర్శనం చేసే మూల గ్రంథం. అందుకే ప్రపంచ భాషలన్నిటి లోకి భగవద్గీత అనువాదమైంది. మనదేశ న్యాయ స్థానాలలో సాక్ష్యమిచ్చే ప్రతి హిందువుకు ప్రమాణ గ్రంథమైంది.

ఈ మధ్య హిందూ కుటుంబాలలో విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంటోంది. ప్రఖ్యాత గాన గంధర్వుడు ఘంటసాల పాడిన ప్రశస్తమైన శ్రీభగవద్గీత రికార్డును ఇండ్లలో ఎవరైనా చనిపోతే లేదా కైలాస రథం, వైకుంఠ రథం వంటి శవాలను కాటికి మోసుకెళ్ళే వాహనాలపైన పెడుతున్నారు. పరమ పవిత్రమైన, వేద, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత శ్లోకాలు వినబడితే ఎవరో చనిపోయిన సూచనగా ప్రజలు భావించే స్థాయికి ఇది దిగజారింది. అంతేగాక గీత వయసు మళ్ళిన వారికి, సన్యాసులకే అని కొందరి భావం. ఇది దురదృష్టకరం.

ప్రపంచంలో ఎందరో మహానుభావులకు మార్గదర్శనం చేసిన అమృత తుల్యమైన, సాక్షాత్తూ భగవంతుని వాణి అయిన భగవద్గీతను ప్రతిరోజూ ఇంటిలో, గుడిలో, బడిలో, మనం వినాలి, మననం చేయాలి, ధ్యానించాలి. యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో మహా సంగ్రామానికి సన్నద్ధమై వచ్చిన మహావీరుడు అర్జునుడు మానసిక బలహీనతతో కర్తవ్య విముఖుడైతే, అతనిలో మళ్ళీ ఉత్సాహాన్ని నింపి, కర్తవ్య నిర్వహణ వైపు నడిపిం చింది శ్రీమత్‌ భగవద్గీత. అర్జునుడికి తన జీవిత ధ్యేయము, కర్తవ్య నిష్ఠ, స్వధర్మ పాలనను తెలియజేసి కార్యోన్ముఖుడ్ని చేసిన అపూర్వమైన భగవత్‌ సందేశమే భగవద్గీత.

శ్రీకృష్ణుడు అర్జునుని మాధ్యమంగా మానవు లందరికి జాతి, మత, కుల, వర్ణ, లింగభేదం లేకుండా తెలిపిన అమృతంతో సమానమైన గీతాలు శాశ్వత సత్యాలు. ఇవి లోకహిత కార్యంలో అందరికీ ఆచరణీయమైనవి.

విశ్వవిఖ్యాత మహనీయులు, ఆధ్యాత్మిక వేత్తలు, వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు శ్రీమత్‌ భగవద్గీత గురించి తెలిపిన అభిప్రాయాలు ఎంతో విలువైనవి.

చక్కని వివిధ కుసుమాల దండవలె ధర్మ సూత్రాల సుందరమైన కూర్పు భగవద్గీత.

– స్వామి వివేకానంద

కని, విని ఎరుగని అమూల్య జ్ఞాన భాండారమే భగవద్గీత.

– మహాత్మా గాంధి

మహా మేధావి గీతా జ్ఞానములో ఒకానొక అంశమును మాత్రమే తెలిసికొనగలడు.

– అరవింద యోగి

విశ్వ వాఙ్మయమంతటిలో మ¬న్నత గ్రంథ రాజం భగవద్గీత.

– శివానంద స్వామి

లోతైన, విశాలమైన ఉన్నత భావాల సాటి లేని గ్రంథం భగవద్గీత.

– మలయాళస్వామి

నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంత ఉపయోగ పడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది.

– వినోబా భావే

భారతదేశ ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథం లేనిదే ఆంగ్ల సాహిత్యం కచ్చితంగా అసంపూర్ణముగానే ఉండేది.

– ఎడ్విన్‌ అర్నాల్డ్‌

భగవద్గీత వంటి అపూర్వ ధర్మ సమన్వయము, అద్భుత వ్యాఖ్య ఏ దేశమునా, ఏ కాలమునా ఎవరూ కని, విని ఉండరు.

– బంకించంద్ర ఛటోపాధ్యాయ

గీతలో గల 18 అధ్యాయాలను ముముక్షువు సాధనకు 18 మెట్లుగా భావించాలి.

– స్వామి విద్యా ప్రకాశానందగిరి

సైన్సు శాస్త్రవేత్తనైన నేను నిజానికి సైన్సు గ్రంథాలకంటే ఎక్కువగా భగవద్గీతనే చదివాను. నేను కనుగొన్న అన్ని ఆవిష్కరణలకు మూలం భగవద్గీతే.

– ఆల్బర్టు ఐన్‌స్టీన్‌

భగవద్గీత పారాయణం చేస్తున్న వారికి, సత్సంగాలు చేస్తున్న వారికి నా విజ్ఞప్తి ఏమిటంటే.. అర్జునునికి గీతాసారం బోధిస్తున్న శ్రీకృష్ణుని (అంటే గీతలో శ్రీకృష్ణార్జునుల చిత్రం) చిత్రపటాన్ని మన ఇళ్ళలోని పూజా మందిరాలు, ధ్యాన మందిరాలలో ఉంచుకోవాలి. అది ఎంతో శక్తిని మనకు ప్రసాదిస్తుంది. దాని ద్వారా భగవంతుని దర్శించాలి, భక్తి, జ్ఞానాలను పొంది మనందరం తరించాలి, తరింప జేయాలి.

కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని చూసి గీతామృతాన్ని అవగాహన చేసుకున్న సంజయుడు గీత చివరి అధ్యాయములో చివరి శ్లోకంలో భగవద్గీత సాధకులకు ఫలశృతి రూపంలో క్రింది విధంగా తెలియజేశారు.

శ్లో || యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః|

తత్ర శ్రీర్విజయో భూర్ద్రువా నీతిర్మతిర్మమ ||

‘యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి ఉంటాయి అని భావం. అందువల్లనే విశ్వ విఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భగవద్గీతను, మహాగణపతి విగ్రహాన్ని తనతోపాటు తీసుకెళ్ళి రోదసి మహాయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చింది.

– డా|| బొడ్డుపల్లి మాణిక్యాచార్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *