మార్చి 15న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేరవౌ।

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా।।

(‘నేను వైకుంఠంలో లేను. యోగుల హృదయాలలోనో, సూర్యునిలోనో కనిపించను. నా భక్తులు తలచేచోట, నన్ను కీర్తించేచోట ఉంటాను’ అని శ్రీమహావిష్ణువు త్రిలోక సంచారి నారదమునితో అన్నట్లు పద్మపురాణం పేర్కొంటోంది. అలాంటి క్షేత్రాలలో ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాలోని నృసింహ క్షేత్రాలలో విశిష్టమైన యాదాద్రి (యాదగిరిగుట్ట) పంచ నారసింహ క్షేత్రం.

యాదాద్రి నారసింహుడి ఆవిర్భావం గురించి పురాణాలలోని విశేషాలను బట్టి మహాజ్ఞాని విభాండకుడి మనవడు (ఋష్యశృంగుడి కుమారుడు) యాదరుషి కృతయుగంలో ప్రహ్లాదుడి మాదిరిగానే పరమ విష్ణుభక్తుడు. నృసింహావతారం దర్శనంపై మక్కువ కలిగినవాడు. ఆయన అనుగ్రహం, సాక్షాత్కారం కోసం అడవిదారి పట్టగా అక్కడి కొండజాతి వారు అతనిని పట్టి క్షుద్రదేవతలకు బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, స్వామి తరపున సుదర్శన చక్రం వచ్చి కాపాడుతుంది. ఈ క్షేత్రం చుట్టూ సుదర్శనుడు రక్షావలయాన్ని నిర్మించాడని ఆస్తికుల విశ్వాసం. హనుమంతుడి సలహా మేరకు యాదరుషి చేసిన తపస్సుకు మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమవుతాడు. అయితే ఆయన ఉగ్రరూపాన్ని దర్శించలేక భీతిల్లుతుండగా స్వామివారు ప్రసన్నా కృతిలో శ్రీలక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తారు. తనను కటాక్షించిన గుహలోనే సామాన్య భక్తులనూ వివిధ రూపాలలో అనుగ్రహించాలన్న భక్తుని విన్నపాన్ని మన్నించి జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీ నృసింహస్వామిగా సాక్షాత్క రించారు. వీరిలో జ్వాలా నృసింహుడు, యోగానంద, లక్ష్మీనృసింహులు కొండగుహలో కొలువుదీరగా, గండభేరుండస్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడితో కలిసి ఉంటారు. ఇక ఉగ్ర నృసింహునిది అభౌతిక రూపమని, తోజో రూపంలో కొండచుట్టూ ఆవరించి ఉంటాడంటారు. మెట్లమార్గంలో శివుడు, నృసింహ స్వామి కంటే ముందే స్వయంభువుగా వెలిశారని చెబుతారు. ఈ పర్వతం సింహాకృతిగా కనిపిస్తుంది. దట్టమైన అడవితో నిండి, నిర్మానుష్య ప్రాంతంలో వెలసిన స్వామి ‘నేను గుట్టమీద ఉన్నాను. నిత్య పూజలకు ఏర్పాటు చేయించు’ అని గ్రామాధికారికి స్వప్నంలో ఆదేశించారట.

ఈ ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం ఈ గుట్టకు రెండు మైళ్ల దూరంలో స్వామివారు వెలిశారు. దానినే పాత నృసింహాలయంగా వ్యవహరిస్తారు.

యాదాద్రి క్షేత్రాన్ని ఎందరో రాజులు దర్శించు కున్నట్లు చారిత్రకాధారాలు ఉన్నాయి. పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్లుడు క్రీ.శ.1148లో యాదాద్రీశుని సేవించుకున్నట్లు భువనగిరి దుర్గంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. కాకతీయ గణపతి దేవుడు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ ప్రాంతం కీకారణ్యంగా ఉండి రాకపోకలకు భక్తులు ఇబ్బంది పడుతుండగా నిజాం పాలకులు కొండమీదకు మార్గం నిర్మించారు. సుమారు 165 ఏళ్లకు ముందు ఆంధప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన లక్ష్మీకాంతయ్య అనే వాగ్గేయకారుడు స్వామి వారిపై రాసిన కీర్తనలను ఆలపించడంతో ఆ సదస్సుల ప్రాచుర్యాన్ని గుర్తించిన నిజాం ప్రభుత్వం నిధులు ఇస్తూ బాగానే ప్రోత్సహించింది. ఆ తర్వాత ఏర్పడిన పాలకమండలి ఏటా పలువురు కళాకారులను ఆహ్వా నించడం మొదలు పెట్టగా, ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఈ సాంస్కృతిక సభలకు విశేష• ప్రాచుర్యం కల్పించారు.

బ్రహ్మోత్సవాలు

ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు (ఈసారి మార్చి 15 నుంచి 25 వరకు) బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తొలినాడు స్వస్తి వాచకంతో ఆలయశుద్ధి, శ్రీమహావిష్ణువు సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి అర్చన నిర్వహిస్తారు. ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ, ఆలయ ధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఆవిష్కరిస్తారు. ఉత్సవ దినాలలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. గతంలో స్వామివారికి ‘భక్తోత్సవాలు’ పేరుతో ఏటా మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఆ తరువాత ఐదు రోజులకు పొడగించారు. ప్రస్తుతం 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 1975 నుంచి ప్రభుత్వం ఉత్సవాలలో పాలుపంచుకుంటూ వస్తోంది. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఈ క్షేత్రం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

బ్రహ్మోత్సవ సేవా విశేషాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు స్వస్తి వాచకసహిత శుద్ధి, రెండవ నాడు ధ్వజారోహణ, ఆ రాత్రి భేరీపూజ చేపడతారు. మూడో రోజు వేదపారాయణం, నాలుగవ రోజు హంసవాహన సేవ, ఐదవ నాడు కల్పవృక్ష సేవ, ఆరవ రోజున గోవర్ధనగిరి అవతారం, ఏడవనాడు స్వామివారి కల్యాణోత్సవానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు తిరుకల్యాణం, తొమ్మిదవ రోజున రథోత్సవం నిర్వహిస్తారు. పదవ రోజున చక్రస్నానం, మరునాడు అష్టోత్తర శతాఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బ్రహ్మాది దేవతలు తరలి వస్తారని విశ్వసించే ఈ ఉత్సవాల వేళ నారదాది మహర్షులు హరి సంకీర్తనలు ఆలపిస్తారట. గరుడాది భక్తాగ్రేసురులు తన్మయ నృత్యాలు చేస్తారట. ‘ఆడేరదివో అచ్చరులెల్లరు/పాడేరు గంధర్వ పతులెల్లా/ వేడుకతో ఏగెను విష్వక్సేనుడు….’ అంటారు అన్నమాచార్య తిరుమలేశుని తిరువీధుల ఉత్సవాన్ని వర్ణిస్తూ. యాదగిరీశ్వరుడి వైభవం అలాంటిదే.

తొలి దర్శనం క్షేత్రపాలకుడికే

ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తరువాతే నృసింహదేవుడి గర్భాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదాల నుంచి ఉద్భవించిన గంగగా అవతరించిన ఈ కోనేటిలో స్నానంతో సమస్త పాపాలు హరించిపోతాయని భక్తుల విశ్వాసం. మహర్షులు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ పుష్కరిణిలో స్నానమాడి లక్ష్మీనృసింహుడి దర్శనం చేసు కుంటారని పురాణాలు చెబుతున్నాయి. వారు వస్తున్నప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయంటారు.

క్షేత్ర పాలకుడు గ్రహపీడితులకు రక్షకుడు. అనారోగ్యం, గ్రహపీడ బాధితులు మండలదీక్ష ప్రదక్షిణలు చేపడుతుంటారు. విష్ణు పుష్కరిణిలో స్నానమాచరిస్తూ స్వామిని స్మరిస్తూ, దర్శిండం వల్ల స్వస్థత పొందవచ్చని భక్తుల విశ్వాసం. శరణన్న వాడిని విడువడని నమ్మకం. దానవ్రతాలకు, యజ్ఞ యాగాదులకు, జపతపాదులకు, నియమనిష్ఠలకు వశం కాని శ్రీహరి భక్తికి బందీ అవుతాడని, ముఖ్యంగా ఆర్తులను ఆదుకోవడంలో ముందుంటాడని ఆధ్యాత్మిక•వాదులు చెబుతారు. ఆ కోవలోని ఇతర నృసింహ క్షేత్రాలతో పోలిస్తే అనారోగ్యం, గ్రహ పీడితుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆయన కరుణతో స్వస్థత పొందినవారిలో ‘యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి’ ఈగ బుచ్చిదాసు ఒకరు. ఓరుగల్లుకు చెందిన ఆయన అనారోగ్యంపాలై ఎన్ని మందులు వాడినా గుణం కనిపించకపోవడంతో భగవంతుడిపై భారంవేసి కొండపై గల గుండం వద్ద గుడిసె వేసుకుని ఉంటూ భాగవత ఘట్టాలను పారా••ణం చేయడంతో పాటు భక్తులకు వివరించి చెప్పేవారు. ఒకసారి స్వామివారు ఆయనకు కలలో కనిపించి తనపై కీర్తనలు చెప్పాలని ఆదేశించారట. అప్పటి నుంచి సంకీర్తనలతో పాటు స్వామివారిపై శతకం రాశారు.

ప్రతిష్టాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రీశుని ఆలయ పునర్నిర్మాణంతో పాటు వెయ్యి ఎకరాలలో సకల సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆధ్యాత్మిక’ నగరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2014 సంవత్సరం వరకు ‘యాదగిరిగుట్ట’గా ప్రసిద్ధమైన ఈ క్షేత్రం అటు తరువాత, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ‘యాదాద్రి’గా వ్యవహారంలోకి వచ్చింది. ‘గిరి, గుట్ట’ రెండు పదాలు సమానార్థ కాలే కనుక పునరుక్తి దోషాన్ని నివారిస్తూ శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ ‌స్వామి ‘యాదాద్రి’గా నామకరణం చేశారు. సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌సోమనాథ్‌ ఆలయాన్ని పునర్నించిన తరువాత ఒక ముఖ్యమంత్రి అధికారికంగా ఒక ఆలయ పునర్నిర్మాణానికి పూనుకోవడాన్ని అరుదైన సంఘటనగా చెబుతారు.

రూ.1200 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణ బృహత్‌ ‌పథకం పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రధానాలయం ప్రారంభానికి ముస్తాబైంది. కృష్ణశిలలతో అద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆధారశిల నుంచి గోపురం వరకు కృష్ణశిలతో నిర్మించడం, అదీ ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. రెండు లక్షల టన్నుల కృష్ణ శిలను ఉపయోగించారు. ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి ఈ రాయిని సేకరించారు.

స్వామివారి సేవకు వినియోగించేందుకు 19 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో రూ.5.3 కోట్లతో విష్ణు పుష్కరిణిని నిర్మించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో మేలో పునః ప్రారంభించుకునే అవకాశం ఉందని ఈ నెల 4న యాదాద్రిని సందర్శించి నిర్మాణ పనులు సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు.

 ‘వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి

 తన్నో నృసింహ: ప్రచోదయాత్‌’

– ‌డా।। ఆరవల్లి జగన్నాథస్వామి : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram